: ఓటమి భయంతోనే బీజేపీపై కేసీఆర్ బురద చల్లుతున్నారు: వెంకయ్య నాయుడు
కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావులపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గత్యంతరం లేకే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ ఆలస్యానికి, వెయ్యి మంది బలిదానాలకు కాంగ్రెస్, టీఆర్ఎస్ లదే బాధ్యత అని వెంకయ్యనాయుడు ఆరోపించారు.
ఓటమి భయంతోనే కేసీఆర్ బీజేపీపై బురద చల్లుతున్నారని వెంకయ్య అన్నారు. బీజేపీతో పొత్తుకు కేసీఆర్ ఎందుకు ముందుకు వచ్చాడని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు కింద పనిచేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. బీజేపీ-టీడీపీది అపవిత్ర పొత్తు అంటున్న కేసీఆర్ వ్యాఖ్యలను వెంకయ్య తప్పుపట్టారు. గతంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని కేసీఆర్ మరచిపోతే ఎలా? అని ఆయన చురకలంటించారు.