: నా సినిమాను కూడా ఓ ప్రేక్షకుడిగానే చూస్తాను- రజనీకాంత్
"నా సినిమా అయినా, మరెవరి సినిమా అయినా నేను మాత్రం కేవలం ఒక ప్రేక్షకుడిగానే చూస్తాను. విక్రమసింహా కూడా అలాగే చూశాను. యానిమేషన్ కథలోకి లీనమవడానికి ఒక పది నిమిషాల పాటు అదోలా అనిపించింది. తర్వాత మెల్లగా అదే నన్ను తీసుకుపోయింది. పూర్తిగా లీనమైపోయి ఎంజాయ్ చేశాను. తెలుగు ప్రేక్షకులు మొదటి నుంచీ నన్ను, నా సినిమాలనూ ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. తన కూతురు సౌందర్య దర్శకత్వంలో ఆయన నటించిన 'విక్రమసింహా' చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుక ఈ రోజు సాయంకాలం హైదరాబాదులోని ప్రసాద్ ఐమాక్స్ ధియేటర్లో జరిగింది. ఆ సందర్భంగా రజనీ అచ్చమైన తెలుగులో మాట్లాడుతూ ఆ విధంగా చెప్పారు. ఈ చిత్ర నిర్మాణం గురించి చాలా విశేషాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో దాసరినారాయణరావు, రామానాయుడు, సుబ్బరామిరెడ్డి, రమేష్ ప్రసాద్, మోహన్ బాబు, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందించిన తొలిచిత్రం విక్రమసింహా అంటూ ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఇలాంటి సినిమా నిర్మాణం వెనుక వున్న కష్టాన్ని దర్శకుడు రాజమౌళి సోదాహరణంగా వివరించారు. ఇదే వేదికపై రజనీ సతీమణి లతను, కూతురు సౌందర్యను మోహన్ బాబు ఘనంగా సత్కరించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నిరాడంబరత, వినయం అందరినీ ఆకట్టుకున్నాయి.