: బీజేపీ-టీడీపీ కూటమికి పవన్ కల్యాణ్ సంపూర్ణ మద్దతు
రాష్ట్రంలోని తెలంగాణ, సీమాంధ్రలలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య పూర్తిస్థాయిలో ఎన్నికల పొత్తు కుదరటంతో ఈ కూటమికి మద్దతివ్వాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మోడీ పాల్గొనే అన్ని ప్రచార సభలకు ఆయన హాజరుకానున్నారు. కాగా పవన్ కల్యాణ్ కు సన్నిహితుడైన పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీచేయాలన్న తన ప్రతిపాదనను విరమించుకున్నారు. ఇదిలావుంచితే, మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల 22న సికింద్రాబాద్ లో మోడీ పాల్గొనే బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అనంతరం పవన్ కల్యాణ్ జేపీకి మద్దతుగా ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది.