: సెటిలర్లను వెళ్లిపొమ్మని నేనెప్పుడైనా చెప్పానా?: కేసీఆర్
హైదరాబాదులో ఉన్న ఆంధ్రా సెటిలర్లను వెళ్లిపొమ్మని నేనెప్పుడైనా చెప్పానా? అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. సెటిలర్లను తాము గౌరవిస్తామని, వారు నిరభ్యంతరంగా ఇక్కడే ఉండొచ్చునని ఆయన అన్నారు. అయితే, ఆంధ్రాకు చెందిన ప్రభుత్వోద్యోగులు ఆంధ్రాలోనే పనిచేయాలని, తెలంగాణ వాసులు ఇక్కడ పనిచేయాలని ఆయన అన్నారు.
మెదక్ జిల్లాలోని గజ్వేల్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మెదక్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న కేసీఆర్... నియోజకవర్గ పరిధిలోని గజ్వేల్ లో అశేష జనవాహిని నుద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధంలో విజయం సాధించిన వారికే అధికారాన్ని అప్పగించాలని, తెలంగాణ యుద్ధంలో గెలిచిన తమకే ఓటు వేసి అధికారాన్ని అప్పగించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. ఆలోచించి ఓటు వేయాలని ఆయన చెప్పారు.