: ఆ సూపర్ ఫాస్ట్ రైలు... బోగీలను వదిలి వెళ్లిపోయింది!
ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు వెనుక భాగాన ఉన్న నాలుగు బోగీలను రైల్వే స్టేషన్ లోనే వదలి, కదిలిపోయిన ఉదంతం బీహార్ లో ఇవాళ చోటు చేసుకుంది. దర్భంగ-న్యూఢిల్లీ మధ్య నడిచే సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ రైలు ఉదయం 8.45 గంటల ప్రాంతంలో దర్భంగా జిల్లాలోని లహెరియాసరాయ్ రైల్వేస్టేషనుకు చేరుకుంది. ఆ సమయంలో రైలు వెనుక వైపున ఉన్న నాలుగు బోగీలకు సంబంధించిన లింక్ ఊడిపోయింది. ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది ఎవరూ గమనించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి రైలు బయల్దేరి వెళ్లిపోయింది.
లింక్ ఊడిన నాలుగు బోగీలు స్టేషన్ లోనే ఉండిపోయిన విషయాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే ఆ విషయాన్ని తర్వాత స్టేషన్ అయిన ధల్వారా అధికారులకు తెలియజేశారు. రైలు ఇంజిన్ ను వెనక్కు రప్పించి, లహెరియాసరాయ్ లో ఉండిపోయిన నాలుగు బోగీలను దానికి జతపరిచి పంపించారు. ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. అంతసేపూ సమస్తిపూర్ రైల్వే డివిజన్ లోని ప్రధాన మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. భోగీలను వదిలివెళ్లిన ఘటనపై విచారణ జరుపుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. రైల్వే ఉద్యోగులెవరిదైనా అలసత్వం ఉన్నదని తేలితే... బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.