: 20వ తేదీ నుంచి కేసీఆర్ సుడిగాలి పర్యటన
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఈ నెల 20వ తేదీ నుంచి సుడిగాలి పర్యటన చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తాను పోటీ చేస్తున్న గజ్వేల్ లో ఇవాళ రాత్రి మెదక్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. 19న చేవెళ్ల, మల్కాజిగిరి సభలతో పాటు, షాద్ నగర్ సభలోనూ ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత నుంచి ఆయన తెలంగాణ జిల్లాలను చుట్టబోతున్నారు.
ఒక్కో రోజు 10 సభల్లో పాల్గొనేలా కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ను ఖరారు చేశారు. మొదట 20న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఆ రోజు ముథోల్, నిర్మల్, బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ, ఆదిలాబాద్, ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, సిర్పూర్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం సభల్లో ఆయన ప్రసంగిస్తారు.
21వ తేదీన కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుజురాబాద్, మంథని, పెద్దపల్లి సభల్లో కేసీఆర్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వివరించాయి. మరోవైపు కేసీఆర్ త్రీడీ ప్రచారం కూడా కొనసాగుతుందని వారు తెలిపారు.