: తప్పని చెప్పి...ప్రాణాలు కోల్పోయాడు
కల్లు వ్యవహారం ఓ మనిషి నిండు ప్రాణాలు తీసింది. తప్పుని తప్పని చెప్పిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని లంకలపల్లిపాలెం గ్రామంలో నివసించే కొయ్య అప్పారావు అదే గ్రామానికి చెందిన రీసు రాము చెట్టు వద్దకు వెళ్లి కల్లు గీస్తున్న అతన్ని తాటి కల్లు అడిగాడు. మధ్యాహ్నం సమయంలో కల్లు రాదని అన్నాడు. దీంతో అప్పారావు ఆ చెట్టు ఎక్కి కమ్మలు నరకడం ఆరంభించాడు.
దీంతో అటుగా వస్తున్న పెసల నర్సింహులు, నక్కాన అప్పన్నలు అప్పారావును మందలించాడు. దీంతో, కోపంతో ఉన్న అప్పారావును సముదాయించడానికి... నువ్వు చేసింది తప్పు అలా వ్యవహరించడం సరికాదని నక్కాన అప్పన్న అన్నాడు. దీంతో అప్పటికే ఆగ్రహంతో ఉన్న అప్పారావు తొలుత అప్పన్న చేతిలో ఉన్న కర్రను నరికాడు. వెంటనే అతను ఊహించేలోపు అతని మెడపై వేటు వేశాడు.
దీంతో అతను హాహాకారాలు చేయడంతో, తండ్రిని రక్షిద్దామని దగ్గర్లో ఉన్న అతని కొడుకువచ్చాడు. కొడుకును కూడా అప్పారావు గాయపరచడంతో అతను గ్రామంలోకి పరుగుతీసి గ్రామస్థులను వెంటబెట్టుకుని సంఘటనా స్థలానికి వచ్చాడు. అయితే, అప్పటికే అప్పన్న మృతి చెందాడు. దీంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది.