: నేడు తేలనున్న టీడీపీ-బీజేపీ సీమాంధ్ర పొత్తు


కుదిరిందనుకున్న పొత్తు కాస్తా టీడీపీ, బీజేపీ మధ్య పీటముడిలా మారింది. రెండు వైపుల నుంచి పొత్తుకు వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతున్నాయి. సీమాంధ్రలో బీజేపీ 5 లోక్ సభ, 15 శాసనసభ స్థానాల్లో, మిగిలిన చోట టీడీపీ పోటీ చేసేలా పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీకి ఒక లోక్ సభ స్థానాన్ని టీడీపీ తగ్గించింది. అయితే, కేటాయించిన స్థానాల విషయంలోనూ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి.

తమకు కేటాయించిన స్థానాలు మార్చాలని బీజేపీ కోరడం, టీడీపీ నిరాకరించడం తెలిసిందే. అయితే, ఇచ్చిన నాలుగు స్థానాల్లోనూ బీజేపీ బలహీన అభ్యర్థులను పోటీకి దింపుతోందంటూ టీడీపీ అభ్యంతరం లేవనెత్తింది. దీంతో పొత్తుపై ప్రతిష్టంభన ఏర్పడింది. విడిగానే పోటీ చేద్దామంటూ ఇరు పార్టీల శ్రేణులు పల్లవి అందుకున్నాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ తో పొత్తుపై నిన్న అర్ధరాత్రి చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు ఈ రోజు టీడీపీ నేతలతో చర్చలు జరపనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. నామినేషన్ల దాఖలుకు రేపటితో చివరి రోజు కావడంతో ఈ రోజు పొత్తుపై స్పష్టమైన ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News