: మునియప్పకు ఓటేసేందుకు ‘వాస్తు’ బాలేదట!


కేంద్ర మంత్రి, కోలార్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి మునియప్ప ‘వాస్తు’ నమ్మకం ఆ అధికారి కొంప ముంచింది. ‘వాస్తు’ అనుకూలంగా లేదన్న కారణంగా మునియప్ప అనుచరులు కర్ణాటకలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) దిశను తిప్పినందున అక్కడున్న పోలింగ్ అధికారి ‘దశ’ మారిపోయింది.

కోలార్ లోని హారోహల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన మునియప్ప దక్షిణం అభిముఖంగా ఈవీఎం ఉండడాన్ని చూసి అసంతృప్తి చెందారు. వాస్తుపరంగా ఇది మంచిది కాదని భావించిన మునియప్ప తన మద్దతుదారుల సహాయంతో ఈవీఎంను ఈశాన్య దిశలో ఉంచారు. ఆ తర్వాత తన ఓటును ‘సంతృప్తి’గా వేశారు.

ఈ తతంగాన్ని గమనించినా అభ్యంతరం తెలియచేయనందుకు అక్కడి ఎన్నికల అధికారిని బదిలీ చేసినట్లు కోలార్ డిప్యూటీ కమిషనర్, రిటర్నింగ్ అధికారి డి.కె.రవి ఇవాళ మీడియాకు తెలిపారు. ఈవీఎం దిశను కాని, స్థానాన్ని కాని మార్చడం చట్ట విరుద్ధమని ఆయన చెప్పారు. మరి, ఈవీఎం దిశను మార్చిన మునియప్ప అనుచరులపై చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించగా, ‘దానిపై కూడా మీకు సమాచారం ఇస్తాను’ అని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News