: చిరంజీవిపై నంబూరు శ్రీను సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీమాంధ్ర ప్రచార కమిటీ ఛైర్మన్ చిరంజీవిపై ఆ పార్టీ నేత నంబూరు శ్రీను సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా తిరువూరులో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీను చిరంజీవిపై విమర్శలు కురిపించారు. పీఆర్పీలో టికెట్ ఇప్పిస్తామని ఐదేళ్ల క్రితం హైదరాబాదులో 2.5 ఎకరాల భూమిని పార్టీ ఆఫీసు కోసం బడే రవి పేరిట రిజిస్టర్ చేయించుకున్నారంటూ దానికి సంబంధించిన పత్రాలను మీడియా ముందుకు తీసుకువచ్చారు.
గతంలో నంబూరు శ్రీనుకు పీఆర్పీ తరపున తిరువూరు నుంచి టికెట్ కేటాయించి చివరి నిమిషంలో మరొకరికి కేటాయించారు. ఈ క్రమంలో పీఆర్పీలో టిక్కెట్లు ఇస్తామంటూ పార్టీ ఆఫీసు కోసం తన భూమిని రిజిస్టర్ చేయించుకున్నారని, అయితే తనకు టికెట్ ఇవ్వనందున తన భూమిని ఇవ్వాల్సిందిగా చిరంజీవిని కోరానని శ్రీను చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టికెట్ ఇప్పిస్తామని చిరంజీవి, కేవీపీ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. కాగా ఈసారి కూడా తిరువూరు టికెట్ వేరే వారికి కేటాయించడంపై ఆగ్రహంతో నంబూరు శ్రీను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అలాగే భూమి విషయంలో చిరంజీవిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని శ్రీను హెచ్చరించారు.