: దేశంలో ఇప్పుడు డబ్బు కట్టలు తెగుతోంది!
ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచిందనుకొంటే పొరపాటే. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో అక్రమంగా తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ లో పట్టుబడిన సొమ్ము ఇప్పటివరకు 129 కోట్లు. దేశవ్యాప్తంగా రూ. 269 కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
అక్రమంగా తరలిస్తున్న డబ్బును అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లోనే పట్టుకున్నామని అధికారులు చెప్పారు. ఆ తర్వాత మహారాష్ట్ర రూ.33.46 కోట్లు, తమిళనాడులో 9.87 కోట్లు, కర్ణాటకలో 12.29 కోట్లు, ఉత్తరప్రదేశ్ లో 12 కోట్లు, పంజాబ్ లో 5 కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
డబ్బే కాకుండా... దేశవ్యాప్తంగా 132 కోట్ల లీటర్ల మద్యం 104 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ వ్యవహారంలో 12 వేల మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడానికి ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఆదాయపన్ను శాఖ, ఎక్సైజ్, ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసు ఉద్యోగులను బృందాలుగా నియమించారు. మార్చి 5వ తేదీ నుంచి ఈ బృందాలు దేశవ్యాప్తంగా అక్రమ డబ్బు, నల్లధన తరలింపును అడ్డుకుంటున్నాయి.
గత ఎన్నికలతో పోల్చుకుంటే 2014 ఎన్నికల్లో అక్రమ నగదు తరలింపు ఎక్కువగానే ఉందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా మరికొన్ని కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో పెద్ద మొత్తంలో అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకునే అవకాశం ఉందంటున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టకుండా, వివిధ మార్గాల ద్వారా డబ్బు తరలింపును ఎన్నికల కమిషన్ అధికారులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.