: నేటి నుంచి హజారే దేశవ్యాప్త పర్యటన
అవినీతి పీచమణిచే బలమైన లోక్ పాల్ బిల్లు కోసం సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి ఉద్యమ క్షేత్రంలోకి దిగుతున్నారు. నేటి నుంచి ఏడాదిపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో సుదీర్గ పర్యటన జరపబోతున్నారు.
నేడు పంజాబ్ లోని అమృత్ సర్ పట్టణం నుంచి హజారే తన యాత్రను ప్రారంభిస్తారు. తొలి దశలో పంజాబ్, హర్యానా, ఉత్తరాంచల్ రాష్ట్రాలలో పర్యటిస్తారు. కనీసం 36 పట్టణాలలో ప్రజలను ఉద్దేశించి హజారే ప్రసంగిస్తారు. ఏప్రిల్ 17న హరిద్వార్ కు చేరుకున్న తర్వాత హాజారే యాత్రకు స్వల్ప విరామం ఇస్తారు. ఆ తర్వాత రెండో దశలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఆయన పర్యటన ఉంటుంది.
యాత్రలో భాగంగా లోక్ పాల్ బిల్లు అవసరాన్ని ప్రజలకు వివరించడం, వారిని కూడా తన ఉద్యమం వైపు నడిపించడం కోసం హజారే కృషి చేయనున్నారు. అలాగే అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వచ్ఛంద సంస్థలను కూడా ఆయన కలుపుకుని పోతారు. వాస్తవానికి ఈ పర్యటన జనవరిలోనే ప్రారంభమవ్వాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో హజారే వాయిదా వేసుకున్నారు.