: దారి తప్పి... ఎర్నాకుళం బదులు గుల్బర్గాకు చేరిన రైలు
గుజరాత్ లోని పోకా నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళ్ళాల్సిన ఎక్స్ ప్రెస్ రైలు దారి తప్పి, నిన్న మధ్యాహ్నం కర్ణాటకలోని గుల్బర్గా చేరుకుంది. రైల్వే అధికారుల సమన్వయ లోపంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా దీన్ని గమనించిన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. పోకా నుంచి బయలుదేరిన ఈ రైలు వనవేలు, మీరజ్ మార్గం గుండా ఎర్నాకుళం చేరుకోవాల్సి ఉంది. అయితే గూడ్స్ రైలు ఒకటి ఇదే మార్గంలో రత్నగిరి వద్ద పట్టాలు తప్పడంతో ఎక్స్ ప్రెస్ రైలు మార్గాన్ని మార్చారు. ఈ సమయంలోనే రైల్వే డ్రైవర్ కు, సిబ్బందికి మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. దీంతో కట్టలు తెంచుకున్న ప్రయాణికుల ఆగ్రహానికి వివరణ ఇవ్వలేకపోయిన రైల్వే అధికారులు అతి కష్టం మీద వారికి నచ్చ జెప్పి మళ్లీ గమ్యస్థానమైన ఎర్నాకుళం వైపు మళ్లించారు.