: టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ: లోకేష్


ప్రస్తుత పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు తనయుడు, టీడీపీ యువనేత లోకేష్ వ్యాఖ్యానించారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలంటే టీడీపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన నెల్లూరు జిల్లా, గూడూరు నియోజకవర్గంలో పర్యటించారు. గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరులో లోకేష్ యువ ప్రభంజనం యాత్రలో పాల్గొని ప్రసంగించారు.

రైతన్నలు ఇబ్బంది పడవద్దని, టీడీపీ అధికారంలోకి వస్తే రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేశారు. రుణ మాఫీ చేయడం అసాధ్యమని చాలామంది నేతలు అంటున్నారని, లక్షల కోట్లు దోచుకున్న ఆ యువ నాయకుడి చేత అవినీతి సొమ్ము కక్కిస్తే రైతు రుణమాఫీ సాధ్యమేనని ఆయన అన్నారు. ఏ ఒక్క రైతు దిగులు పడవద్దని, రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి రాబోతోందని, ఆ యువ నేత దోచుకున్న అవినీతి సొమ్మును కక్కిద్దామని జగన్ ను ఉద్దేశించి లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఏడాది 20 లక్షల మందికి ఉపాధి కావాలని, సైబరాబాద్ లాంటి నగరాలు ఐదు నిర్మించాలని, అది చంద్రబాబుకే సాధ్యమని లోకేష్ చెప్పారు. అంతకు ముందు వెంకటగిరిలో కాశీవిశ్వనాథస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

  • Loading...

More Telugu News