: దేశ ప్రతిష్ఠ పెంచా.. దేశానికి సేవ చేస్తా: మహ్మద్ కైఫ్
క్రికెట్ ఆడి దేశ ప్రతిష్ఠను పెంచానని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్న కైఫ్ మాట్లాడుతూ, దేశానికి, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ప్రజలకు పెద్దగా కోరికలు ఉండవని, వారికి మౌలిక అవసరాలు తీర్చడంలో రాజకీయ నేతలు ఎందుకు విఫలమవుతారో అర్థం కావడం లేదని అన్నారు. ఎవర్ని ఓడించాలా? ఎవరికి కాంట్రాక్టులు కట్టబెట్టాలా? అని ఆలోచించడంలో పావు వంతు సమయం కేటాయించినా ప్రజల అవసరాలు తీర్చేందుకు కృషి చేయవచ్చని మహ్మద్ కైఫ్ చెప్పారు. తాను గెలిచి ప్రజలకు సేవ చేసి చూపిస్తానని కైఫ్ హామీ ఇచ్చారు.