: సీటు కోసం జగన్ మూడున్నర కోట్లు అడిగాడు: వైఎస్సార్సీపీ నేత అశోక్ గౌడ్
రాజశేఖర్ రెడ్డి అంటే ఉన్న అభిమానంతో తాను వైఎస్సార్సీపీలో చేరితే జగన్ తన ఇల్లు, ఒళ్లు గుల్లచేశాడని దెందులూరు వైఎస్సార్సీపీ నేత అశోక్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరులో ఆయన మాట్లాడుతూ, తాను వైఎస్ అభిమానినని, ఆయనపై ప్రేమ, అభిమానంతో జగన్ వెంట నడిచానని అన్నారు. ఆది నుంచి తనను వినియోగించుకున్న జగన్ తన ఆస్తులను కొవ్వొత్తిలా కరిగించేశాడని అన్నారు. తాజాగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నేతలను గెలిపించేందుకు 50 లక్షల రూపాయలు ఖర్చు చేశానని, పాదయాత్రలు, ఓదార్పు యాత్రల సందర్భంగా మరింత ఖర్చు చేశానని ఆయన వెల్లడించారు.
ఇంత ఖర్చు చేసిన తరువాత దెందులూరు సీటును తనకు కేటాయించకుండా వేరే వ్యక్తికి కేటాయించారని అశోక్ గౌడ్ కన్నీరు మున్నీరు అయ్యారు. తనను, విశాఖ అభ్యర్థి దొరబాబును తలా మూడున్నర కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమని జగన్ సూచించారని, లేని పక్షంలో తాము సీటిచ్చేవారికి మద్దతు ఇవ్వాలని ఆదేశించారని ఆయన వాపోయారు. ఇప్పటికే స్థాయికి మించి అప్పులు చేశామని, ఎవరినో గెలిపించేందుకు తాము ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీంతో జగన్ పార్టీ దోపిడీపై ప్రజలు చర్చించుకుంటున్నారు.