: నరేంద్ర మోడీ... దేశం గర్వించదగ్గ నాయకుడు: జోషి
దేశంలో నరేంద్ర మోడీ గాలి ఏమీ లేదని, కేవలం బీజేపీ హవా మాత్రమే ఉన్నదని వ్యాఖ్యానించిన బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఒక్క రోజు వ్యవధిలోనే మాటమార్చారు. ఈ వివాదం మరింత రాజుకోక ముందే జోషి తన గత వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అంతేనా... మోడీని ఒక సమర్థ నాయకుడిగా అభివర్ణించి ఆయన తన విధేయతను చాటుకున్నారు. ప్రస్తుతం ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే మోడీ వంటి సమర్థ నాయకుడు అవసరమని జోషి తెలిపారు.
ఆదివారం నాడు చోటు చేసుకున్న వివాదాలకు తెరదించిన జోషి కాన్పూర్ లో మీడియాతో మాట్లాడారు. ‘మోడీకి, నాకు మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఆయన మా పార్టీ గర్వించదగ్గ నాయకుడు’ అని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రజలను ప్రభావితం చేసే కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలంటే అది మోడీతోనే సాధ్యమని అన్నారు. బీజేపీ-నరేంద్ర మోడీ వేర్వేరు కాదని, పార్టీతో ముడిపడిన వ్యక్తే మోడీ అని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఈరోజు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.