: మలేసియా విమానం ఆచూకీపై రేకెత్తిన ఆశలు
అదృశ్యమైన మలేసియా విమానం ఆచూకీపై ఆశలు రేకెత్తుతున్నాయి. విమానం కూలిపోయిందని భావిస్తున్న చోటకు నౌకలు, విమానాలు చేరుకున్నాయి. కూలిపోయిన చోటుగా భావిస్తున్న ప్రాంతంలో పెద్ద మొత్తంలో చమురు తెట్టులు దర్శనమిచ్చాయి. దీంతో నిపుణులు చమురు తెట్టు శాంపిల్స్ సేకరించారు. దీనిని విశ్లేషిస్తే విమానం ఇంధనమా? లేక ఏదయినా నౌకకు సంబంధించిన ఇంధనమా? అనేది తెలిసే అవకాశం ఉంది. శాంపిల్ లోని చమురు విమానం ఇంధనంగా తేలితే మలేసియా విమానం అదృశ్యం మిస్టరీ వీడుతుంది.
చమురు తెట్టు లభ్యమైన పరిసరాలను ఆధారం చేసుకుని గాలింపు చేపట్టనున్నారు. సముద్రంలో సెన్సార్లు, సోనార్ మ్యాపింగ్ ద్వారా వస్తువులను పసిగట్టే బ్లూఫిన్ జలాంతర్గామిని ప్రవేశపెట్టనున్నారు. రిమోట్ సాయంతో దీనిని నడిపించవచ్చు. దీని ద్వారా బ్లాక్ బాక్స్ ఆచూకీ కనుక్కోవచ్చని నిపుణుల ఆలోచన. ఈ నెల 8 నుంచి బ్లాక్ బాక్స్ నుంచి సిగ్నల్స్ రావడం ఆగిపోయింది. దీంతో బ్లాక్ బాక్స్ లో బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.