: ఒక్క ఉద్యోగానికి వందల మంది దరఖాస్తు చేస్తున్నారు: రాహుల్ గాంధీ
దేశంలో నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ లో ఆయన మాట్లాడుతూ, ఒక్కో ఉద్యోగానికి ఐదు వందల మంది విద్యార్థులు దరఖాస్తులు చేస్తున్నారని అన్నారు. విద్యావంతులు పెరిగిపోయారు, ఉద్యోగావకాశాలు కల్పించలేకపోతున్నామని ఆయన చెప్పారు. రాజీవ్ మిషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇప్పుడు ఒక్కో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఉంటే మిగిలిన వారంతా నిరుద్యోగులుగా ఉండిపోతున్నారని, వారికి కూడా ఉద్యోగాలు కల్పించగలగాలని ఆయన సూచించారు. గ్రామాల్లో ప్రజలు పొట్ట చేతబట్టుకుని తరలి పోతున్నారని, వారి కోసం ఆహార భద్రత బిల్లు తీసుకొచ్చామని ఆయన అన్నారు. ప్రజలందరికీ ఉపయోగ పడేలా మేనిఫెస్టోను ఆరు నెలలు కష్టపడి రూపొందించామని ఆయన తెలిపారు. పేదల అభ్యున్నతికి అందులో పెద్దపీట వేశామని ఆయన చెప్పారు.