: విమానయాన సంస్థలకు కాసులు కురిపిస్తున్న ఎన్నికలు


ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు... పాదయాత్రలు కొద్దిమంది నేతలే చేస్తారు. మిగిలిన నేతలు ఆకాశమార్గాన్ని ఎంచుకుని విమానాలలో ప్రయాణాలు చేస్తారు. అందుకే ఈ ఎన్నికల సీజన్ లో దేశంలోని 130 చార్టర్డ్ విమాన సంస్థలు భారీగా బిజినెస్ చేసుకుంటున్నాయి. ప్రతి సారీ ఎన్నికల వ్యయం పెరుగుతోంది. దీంతో విమాన ప్రయాణాల ఖర్చులు కూడా ఆకాశాన్నంటుతున్నాయి.

ఈ సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని గత రెండేళ్లుగా నష్టాల్లో ఉన్న చార్టర్డ్ విమాన సేవల రంగం ఒక్కసారిగా పుంజుకుని లాభాల బాటలో పయనిస్తోంది. ఒక అంచనా ప్రకారం బిజినెస్ లో సుమారు 40 శాతం వరకు పెరుగుదల ఉంది. వ్యాపార వర్గాల కథనం మేరకు ఒక్కో ప్రధాన రాజకీయ పార్టీ సుమారు 350 నుంచి 400 కోట్ల రూపాయల మేరకు ఎన్నికల వేళ విమాన లేదా హెలికాప్టర్ యానానికి ఖర్చు చేస్తున్నాయి.

ఇప్పటివరకూ లోహ విహంగాల్లో అత్యధిక సమయం ప్రయాణించిన ఘనత నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలకే దక్కుతుంది. ఇద్దరూ రోజూ మూడు నాలుగు సభల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి వారికి దేశమంతా చుట్టి వచ్చేందుకు విమానాలు తప్పనిసరి అవుతున్నాయి. ఇంతగా విమానాలను వాడుతున్నా వారు 200 నియోజకవర్గాలకు మించి వెళ్లడం కష్టం. విమానాలు లేకపోతే నలభై యాభై నియోజకవర్గాలను మాత్రమే కవర్ చేయగలుగుతారు.

చార్జర్డ్ విమానయాన రంగం నిపుణుల కథనాల మేరకు సుమారు 520 హెలికాప్టర్లు, విమానాలు అద్దెకు దొరుకుతున్నాయి. మామూలు సింగిల్ ఇంజన్ విమానాలు గంటకు 75 వేల నుంచి లక్ష రూపాయల వరకూ చార్జి చేస్తున్నాయి. అయితే ముఖ్య నేతలు డబుల్ ఇంజన్ ఉన్న నాలుగు సీటర్లను ఎక్కువగా వాడుతున్నారు. ఇవి గంటకు 2.5 నుంచి 3 లక్షల వరకూ అద్దెని వసూలు చేస్తున్నాయి.

ఈ ఎన్నికలు ఒక్క విమాన యాన సంస్థలకే కాదు... ఇతరత్రా వాటికి కూడా మంచి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఎయిర్ పోర్టులు లాండింగ్, టేకాఫ్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. అలాగే విమానాల మరమ్మత్తులు, మెయింటెనెన్స్ కూడా భారీ ఆదాయాన్నిస్తోంది.

  • Loading...

More Telugu News