: ఫ్లాట్లు కొని, పాట్లు పడుతున్న అమితాబ్ ఫ్యామిలీ
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం ఓ వివాదంలో చిక్కుకుంది. తమ కార్యాలయ భవంతి అయిన 'జనక్' వ్యవహారంలో న్యూ ఇండియా హౌసింగ్ సొసైటీతో వీరికి గత కొద్ది కాలంగా వివాదం నడుస్తోంది. ఆ హౌసింగ్ సొసైటీలో 2004లో ఆరు ఫ్లాట్లు కొనుగోలు చేసిన బచ్చన్ కుటుంబం, వాటిని తమ ప్రైవేటు కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు.
కాగా, ఆ సొసైటీలో సభ్యత్వం కొరకు బిగ్ బి కుటుంబం ఇటీవలే దరఖాస్తు చేసుకుంది. అయితే, సదరు సొసైటీ భారీ ఎత్తున బదిలీ ఫీజు చెల్లించాలని కోరడంతో బచ్చన్ లు కంగుతిన్నారు. గృహ చట్టాల నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రూ. 25,000 లను ఇవ్వబోగా సొసైటీ తిరస్కరించింది. రూ. 3 కోట్లకు పైగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య కొంతకాలం లీగల్ నోటీసుల యుద్ధం నడిచింది.
కాగా, సొసైటీ.. బచ్చన్ కుటుంబానికి రాసిన ఓ లేఖలో కొన్ని కారణాల వల్ల ఆ ఆరు ఫ్లాట్లను వారి పేరిట ట్రాన్స్ ఫర్ చేయలేమని, అసలు ఆ ఫ్లాట్లను కొనుగోలు చేయడం అక్రమమని పేర్కొంది. అంతేగాకుండా అక్కణ్ణుంచి ఖాళీ చేయమని కూడా బచ్చన్ లకు నోటీసులు పంపింది. దీంతో, బచ్చన్ కుటుంబం ఓ న్యాయ సహాయ సంస్థను ఆశ్రయించినట్టు తెలుస్తోంది.