: మోడీపై తమిళనటుడు విజయ్ కాంత్ గుర్రు
తమిళనాడులో బీజేపీకి, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ కు మధ్య సంబంధాలు బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. దీనికి నిదర్శనం నిన్న చెన్నైలో జరిగిన మోడీ ర్యాలీలో విజయ్ కాంత్ గానీ, ఆయన పార్టీ నేతలు గానీ పాల్గొనకపోవడమే. తమిళనాడులో బీజేపీ ఏడు పార్టీలతో కలసి మహా కూటమిగా ఏర్పడడంలో డీఎండీకే తనవంతు పాత్ర పోషించింది. ఈ కూటమిలో పెద్ద పార్టీ కూడా ఇదే. పైగా విజయ్ కాంత్ మోడీని ప్రధానిని చేయాలని, దేశంలో అవినీతిని ఆయనొక్కరే నిర్మూలించగలరంటూ ప్రచారం చేస్తున్నారు.
అయితే, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ నిన్న చెన్నైకి వచ్చి అగ్ర నటుడు రజనీకాంత్ ను కలవడం, విజయ్ కాంత్ ను విస్మరించడం ఆయన్ను బాధించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. పైగా మోడీ పర్యటన గురించి కూడా సమాచారం లేకపోవడంతో విజయ్ కాంత్ అసంతృప్తికి లోనయ్యారని చెప్పాయి. బీజేపీకి మద్దతు పలకకపోయినా మరో నటుడికి ఆ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని విజయ్ కాంత్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి.