: వారణాశిలో తప్పిన బిగ్ ఫైట్


అవును... ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ నియోజకవర్గంలో బిగ్ ఫైట్ తృటిలో తప్పిపోయింది. ఈ స్థానం నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయనపై బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇదే సమయంలో అక్కడ నుంచి పోటీ చేయడానికి రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక సన్నద్ధమయ్యారు. బరిలోకి దిగేందుకు అన్నీ సిద్ధం కూడా చేసుకున్నారు. ఇదే జరిగి ఉంటే, దేశం యావత్తు వారణాశి స్థానం మీద దృష్టి సారించేది.

ప్రియాంక పోటీ చేస్తే మోడీ కూడా దేశం మొత్తం మీద కాకుండా, ఉత్తరప్రదేశ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేశాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ మేథోమథనం సాగించింది. ప్రియాంక పోటీ చేయకపోవడమే మంచిదని నిర్ణయించింది. ఎందుకంటే, ఇప్పటికే రాహుల్ ను బలహీనమైన అభ్యర్థిగా బీజేపీ చిత్రీకరిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రియాంక బరిలోకి దిగితే రాహుల్ కు చేతకాకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ప్రియాంకను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చిందనే అపవాదును బీజేపీ వేస్తుందని కాంగ్రెస్ పెద్దలు భావించారు. దీంతో, ఓ బిగ్ ఫైట్ మిస్ అయింది. ప్రియాంక కూడా తాను వారణాశి నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించింది. ప్రియాంక బరిలోకి దిగి ఉంటే... రాజకీయం మరింత రంజుగా ఉండేది.

  • Loading...

More Telugu News