: సంజూ విషయంలో పాక్ లో మిశ్రమ స్పందన
ముంబయి పేలుళ్ళ కేసులో ఐదేళ్ళ జైలు శిక్షకు గురైన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై పొరుగు దేశం పాకిస్తాన్ లో మిశ్రమ స్పందన వ్యక్తం అయింది. పాక్ సినీ, టీవీ రంగాలకు చెందిన పలువురు సంజూ విషయంలో సానుభూతి వ్యక్తం చేయగా, మరికొందరు అతను శిక్షకు అర్హుడే అని వ్యాఖ్యానించారు. పాక్ వెటరన్ నటుడు తలత్ రాణా మాట్లాడుతూ, చట్టానికి ఎవరూ అతీతులు కారని వ్యాఖ్యానించాడు. నటులూ ఇందుకు మినహాయింపు కాదని చెప్పాడు.
సంజయ్ దత్ తల్లి, ప్రఖ్యాత నటి నర్గీస్ ను గుర్తు చేస్తూ, ఆమె కుమారుడిగా సంజయ్ దత్ ను 'సగం ముస్లిం' మతస్థుడిగా అభివర్ణించాడు. అలాంటి వ్యక్తి చట్టానికి లోబడి ఉండడం తెలుసుకోవాలని రాణా సూచించాడు. మరో నటుడు జావేద్ షేక్ మాట్లాడుతూ, ఈ కేసు ఏళ్ళ తరబడి కొనసాగిందని, ఏదేమైనా జడ్జి నిర్ణయం అంతిమమని వ్యాఖ్యానించాడు.
ఇక నిన్నటి తరం టీవీ నటుడు రహత్ కాజ్మీ నిబంధనలను ఎవరైనా పాటించాల్సిందే అన్నాడు. సమాజంలో మనమూ ఓ భాగమైనప్పుడు నేరానికి పాల్పడితే మూల్యం చెల్లించుకోకతప్పదని చెప్పాడు. కాగా, సంజయ్ దత్ మిత్రుడు, పాక్ సినీ హీరో మోమార్ రాణా సానుభూతి కురిపించాడు. కెరీర్ చరమాంకంలో ఉన్న దశలో సంజూకి ఇంతటి కష్టం రావడం బాధాకరమని వ్యాఖ్యానించాడు. వ్యక్తిత్వం పరంగా సంజయ్ దత్ ఆణిముత్యంలాంటి వాడని కితాబిచ్చాడు.