: విమానంపై ఇన్నాళ్లకు దర్యాప్తుకు ఆదేశించిన మలేసియా
వెనకటికి దొంగలు పడ్డ ఆరు మాసాలకు కుక్కలు మొరిగాయట. మలేసియా ప్రభుత్వం తీరు కూడా అలాగే వుంది. విమానం అదృశ్యమై నెల దాటిన తరువాత ఇప్పటికి మేలుకుంది. విమానం అదృశ్యంపై దర్యాప్తుకు ఇప్పుడు ఆదేశించింది. మలేసియా విమానం దారి మళ్లగానే దానిని వెతకడంలో ఆలస్యం ఎందుకు జరిగింది? దారి మారగానే విమానం ఎటు వెళ్తుందో ఎందుకు గమనించలేదు? దీనికి బాధ్యులు ఎవరు? పౌరవిమాన యాన రంగం తప్పు ఎంత? మిలటరీ విభాగం తప్పు ఎంత? అనే విషయాలపై మలేసియా ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. దీనిపై మలేసియా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి.
విమానం కుప్పకూలడానికి కొన్ని నిమిషాల ముందు కో పైలట్ తన సెల్ నుంచి ఫోన్ చేశాడని, అయితే సెల్ కనెక్టివిటీ లేకపోవడంతో కాల్ కనెక్ట్ కాలేదన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే విమానంలో అసాధారణ పరిస్థితిని గమనించి ఫోన్ చేసేందుకు ప్రయత్నించారా? లేక ఇంకేదయినా సమాచారం కోసం ప్రయత్నించారా? అనేది తెలియాల్సి ఉంది. వీటికి సమాధానాలు తెలియాలంటే విమానం బ్లాక్ బాక్స్ లభించాలి. అది లభించాలంటే హిందూ మహాసముద్రంలో కుప్ప కూలిన విమానాన్ని గుర్తించగలగాలి.