: వీరూ రూటే వేరు
విధ్వంసక బ్యాటింగ్ అంటే ఏంటో ప్రపంచ క్రికెట్ కు పరిచయం చేసిన భారత ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. పిచ్ పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రత్యర్థి బౌలర్ ఎంతటి వాడైనా లెక్కచేయని తత్వం అతని సొంతం. కొన్నిసార్లు ఆ ధోరణి సత్ఫలితాలిచ్చినా, ఒక్కోసారి జట్టును కష్టాల్లోకి నెట్టేది. సెంచరీ ముంగిట కూడా సిక్సర్ కొట్టేందుకు వెనకాడని దూకుడు నైజంతో ఎన్నోసార్లు మూడంకెల స్కోరు ముందు బోల్తా కొట్టాడు.
ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయి, తద్వారా, భారత్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన వీరూ ఇప్పుడు ఐపీఎల్ లో తన సత్తా చాటేందుకు సై అంటున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కు గత సీజన్ లో కెప్టెన్సీ వహించిన సెహ్వాగ్ తాజా సీజన్ లో సారథ్యాన్ని లంక ఆటగాడు మహేల జయవర్ధనేకు అప్పగించాడు.
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ఆరవ సీజన్ ఆరంభం అవనున్న తరుణంలో, కెప్టెన్సీ ఉన్నా, లేకున్నా తన ఆటతీరులో ఎలాంటి మార్పు ఉండదని అంటున్నాడు. కెప్టెన్సీ ఎన్నడూ తన ఆటపై ప్రభావం చూపలేదని చెబుతున్నాడు. గత ఐపీఎల్ లో సారథ్య బాధ్యతలు మోస్తూనే వరుసగా 5 హాఫ్ సెంచరీలు బాదానని సెహ్వాగ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అదో రికార్డు అని సెహ్వాగ్ అన్నాడు.