: రాష్ట్ర పునర్నిర్మాణం చంద్రబాబు వల్లే సాధ్యం: సీతామహాలక్ష్మి
రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే శక్తి చంద్రబాబుకే ఉందని, ప్రస్తుతం సీమాంధ్రను అభివృద్ధి చేయాలన్నదే తమ ముందున్న లక్ష్యమని రాజ్యసభ సభ్యురాలు, పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి తెలిపారు. ఇవాళ చిలకలూరిపేటకు వచ్చిన ఆమె నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం కాపు సామాజికవర్గంలోని ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆమె చెప్పారు.
రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ... సీమాంధ్రలో 130 స్థానాలను సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా సీమాంధ్రను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సౌత్ సెంట్రల్ జోన్ ను రెండు భాగాలుగా విభజిస్తున్నారని, సీమాంధ్రకు సంబంధించిన సెంట్రల్ జోన్ ను గుంటూరులో ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరో వారంలో కాచిగూడ-గుంటూరు మద్య డబుల్ డెక్కర్ రైలు నడుపుతున్నట్లు తెలిపారు. కాళహస్తి-నడికుడి రైల్వే మార్గానికి సర్వే పూర్తయిందని, వచ్చే బడ్జెట్ లో నిర్మాణపు పనులు ప్రారంభించేలా చూస్తామన్నారు.