: మోడీ కోసం జశోదా మూడు నెలలుగా ఉపవాసం?
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రధానిగా చూడాలనే కోరికతో ఆమె భార్య జశోదాబెన్ మూడు నెలలుగా ఉపవాసదీక్ష చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె అన్నయ్య కమలేష్ ఒక పత్రికకు తెలిపారు. జశోదా ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి పదవీ విరమణ చేసి తన తండ్రి ఇంటి వద్దే ఉంటున్నారు. పదవీ విరమణ తర్వాత ఆమె ఏం కోరుకున్నారో తెలుసా? మోడీ తనను భార్యగా ప్రకటిస్తే చాలని. ఇప్పుడు ఆమె కోరిక నెరవేరింది.
దీనిపై జశోదా అన్నయ్య కమలేష్ మాట్లాడుతూ... నరేంద్ర భాయ్ తనను భార్యగా అంగీకరించాలన్న తమ సోదరి కోరిక నెరవేరిందన్నారు. తమకు ఎంతో సంతోషంగా ఉందని, మోడీ ప్రధాని కావాలని తామంతా ఇక ప్రార్థిస్తామని ప్రకటించారు. ఉంజాలో కమలేష్ ఓ కిరాణా కొట్టు నిర్వహిస్తున్నారు. 45 ఏళ్ల క్రితం మోడీ ఆమెను విడిచిపెట్టి ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా వెళ్లినప్పటికీ, తిరిగి పెళ్లి చేసుకోవాలని తన సోదరి భావించలేదని తెలిపారు. ఇక మోడీని బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే కోరికతో నాలుగు నెలల పాటు ఆమె పాదరక్షలు వేసుకోలేదని చెప్పారు. ఇప్పుడు మోడీని ప్రధానిగా చూడాలన్న ఆశతో రోజుకు ఒక్కపూటే ఆహారం తీసుకుంటూ ఒక పూట ఉపవాసం చేస్తోందని వెల్లడించారు. జశోదకు భక్తి ఎక్కువని, ప్రతీ ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు ఆమె దైవప్రార్థనలోనే గడుపుతారని, గతంలో ఆమెతో కలసి పనిచేసిన ప్రవీణ్ వ్యాస్ తెలిపారు.