: ఆనం తనయుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు!


నెల్లూరుకు కొత్తగా ఎవరైనా వెళితే అక్కడి ఏసీ మార్కెట్ గురించి వినే ఉంటారు. కూరగాయల మార్కెట్ కూడా ఏసీ చేశారా? అని ఒకింత ఆశ్చర్యపడక మానరు. తీరా, అక్కడికి వెళ్తే తెలుస్తుంది... అది ఆనం కుటుంబంలో తొలి తరం నాయకుడు ఆనం చెంచు సుబ్బారెడ్డి (ఏసీ సుబ్బారెడ్డి) పేరుతో ఏర్పడిన మార్కెట్ అని. ఇప్పుడు మళ్లీ ఏసీ సుబ్బారెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. అయితే, ఈ సుబ్బారెడ్డి ఆనం కుటుంబంలో మూడో తరం నాయకుడు. ఏసీ సుబ్బారెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పెద్దకొడుకు.

ఇప్పటికే వివేకా చిన్న కొడుకు రంగ మయూర్ రెడ్డి కార్పొరేషన్ కు పోటీ చేశారు. తాజాగా ఏసీ సుబ్బారెడ్డి నెల్లూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. నెల్లూరు సిటీ స్థానాన్ని తన కొడుకు సుబ్బారెడ్డికి ఇవ్వాలని ఇటీవల జిల్లాకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని ఆనం వివేకా కోరారు. సుబ్బారెడ్డికి సీటిచ్చేందుకు అధిష్ఠానం కూడా సుముఖంగానే ఉందని తెలిసింది.

కుటుంబానికి ఒకటే టికెట్ అనే నిబంధనను అమలుచేస్తే మాత్రం... ఆనం కుటుంబంలో ఇప్పటికే ఉన్న ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఒకరికే టికెట్ దక్కే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు. మరి ఈసారి ఆనం కుటుంబం నుంచి ఎవరికి టికెట్ ఇస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

  • Loading...

More Telugu News