: గురువారం నుంచి గుంటూరు జిల్లాలో విజయమ్మ పర్యటన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ గురువారం నుంచి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట మూడు రోజుల పాటు ఆమె ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు తెనాలి రూరల్ మండలం కొలకలూరు నుంచి విజయమ్మ పర్యటన ప్రారంభమవుతుంది. గుడివాడ, కోపల్లె, అంగలకుదురు మీదుగా వేమూరు నియోజకవర్గంలోని దుండిపాడు, యడ్లపల్లి, వలివేరు, చుండూరు మీదుగా ఆమె పర్యటన సాగుతుంది. మోదుకూరు నుంచి మోపర్రు, తురిమెళ్ల, అమృతలూరు, గోవాడ మీదుగా రేపల్లె నియోజకవర్గంలోకి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
చెరుకుపల్లి, కావూరు, రాంభోట్లవారిపాలెం గ్రామాల మీదుగా బాపట్ల నియోజకవర్గంలోకి చేరుకుంటారు. చందోలులో సాయంత్రం ఆరుగంటలకు జరిగే సభలో విజయమ్మ ప్రసంగించనున్నారు. 11, 12 తేదీల్లో జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తారు. విజయమ్మ జనభేరికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా నేతలు తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.