: మేం కూడా మీలా చేస్తే పరిస్థితి ఏంటి: తమ్మారెడ్డి భరద్వాజ్


ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న 'హృదయ కాలేయం' సినీ దర్శకుడు స్టీవెన్ శంకర్, నటుడు సంపూర్ణేష్ బాబుపై దాడిని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఖండించారు. అనవసర వివాదాల్ని రేపి ఇబ్బందులు సృష్టించవద్దని ఆయన హెచ్చరించారు. హైదరాబాదులో కోటిన్నర మంది సెటిలర్లు ఉన్నారని, వారందరికీ కోపం వస్తే తెలంగాణ వాదుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అంతవరకు తెచ్చుకోవద్దని, అందరం తెలుగు వారమని, సామరస్యపూర్వకంగా ఉందామని ఆయన హితవు పలికారు.

తెలంగాణ వ్యక్తిని పెట్టి వ్యంగ్యమైన సినిమా తీస్తావా? అంటూ స్టీవెన్ శంకర్ ను కొట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. దీనిని అందరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆయన సూచించారు. తెలంగాణ వాడైన సంపూర్ణేష్ బాబుకి ఆ సినిమా మంచిపేరు తీసుకువచ్చిన విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు. అది మానేసి దాడులకు పూనుకోవడం మంచి పద్దతి కాదని అన్నారు.

కళకు, కళాకారులకు కుల, మత, ప్రాంత భేదాలు ఉండవని తమ్మారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని ఆయన స్పష్టం చేశారు. హృదయ కాలేయం సినిమా విజయవంతమైన సందర్భంగా మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్ లో ఆ సినిమా యూనిట్ పార్టీ చేసుకునేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా కొంత మంది సాఫ్ట్ వేర్ యువకులు సినిమా యూనిట్ తో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News