: అవును, అందుకే ఓడిపోయాం: రాహుల్ గాంధీ
ప్రజలతో మమేకం కావడంలో విఫలమయ్యామని, అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించారు. ఇవాళ న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ... ఇకపై అలాంటి పొరపాట్లు జరగవని చెబుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని కోరారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజలకు జవాబుదారీగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు దక్షిణ ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక సందేశమిచ్చారని ఆయన చెప్పారు.
గతంలో మాదిరిగా ప్రజలతో పార్టీ సంబంధాలు ఇప్పుడు లేవని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుల కోసం కాంగ్రెస్ తలుపులు ఎప్పుడూ బార్లా తెరిచి ఉండేవని అన్నారు. అయితే, ఇప్పుడు అలా తలుపులు తెరవకపోతే ఇబ్బంది తప్పదని ప్రజలు హెచ్చరించారని ఆయన పేర్కొన్నారు. అందుకే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని రాహుల్ వ్యాఖ్యానించారు.