: బుడతడి చేతిలో పేలిన గన్... బాలిక మృతి
అమెరికాలో ఆడుకుంటూ ఉండగా రెండేళ్ల బుడతడి చేతిలో తుపాకీ పేలి... ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన న్యూయార్క్ లోని ఫిలడెల్ఫియాలో చోటు చేసుకుంది. హ్యాండ్ గన్ తో ఆడుకుంటున్న రెండేళ్ల పిల్లాడు... అది కాస్తా పేలడంతో తన 11 ఏళ్ల అక్క మరణానికి కారణమయ్యాడు.
శనివారం నాడు వారి నివాసంలో 11 ఏళ్ల జమారా స్టీవెన్స్, తన ముగ్గురు తోడబుట్టిన వారైన 14 ఏళ్ల బాలుడు, ఏడేళ్ల బాలిక, రెండేళ్ల బాబుతో కలిసి 8 అంగుళాల బ్యారెల్ ఉన్న... 357 క్యాలిబర్ హ్యాండ్ గన్ తో ఆడుకుంటోంది. అది ప్రమాదవశాత్తు పేలి జమారా స్టీవెన్స్ తుదిశ్వాస విడిచింది. అయితే, ఆ సమయంలో ఆమె తల్లి టిప్పనీ గోల్డ్ వైర్ స్నానాల గదికి వెళ్లిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన జరిగిన రోజు ఉదయం ఇంటికి వచ్చిన తల్లి బాయ్ ఫ్రెండ్ ఫ్రిజ్ పై ఉంచిన లోడెడ్ గన్ ను పిల్లలు తీసుకున్నారని న్యూయార్క్ మీడియాలో వార్తలొచ్చాయి. దానితో ఆడుకుంటున్న రేండేళ్ల చిన్న పిల్లాడు గన్ ను తన అక్క వైపు గురిపెట్టాడు. ప్రమాదవశాత్తు ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ ఆమె భుజంలోకి దూసుకుపోయిందని అధికారులు వెల్లడించారు. బుల్లెట్ అక్కడి నుంచి ఛాతీ ద్వారా గుండెను తాకిందని దర్యాప్తు అధికారులు చెప్పారు. ఆ పిల్లవాడు తుపాకీ పేల్చాడనడానికి సాక్ష్యంగా అతడి భుజంపై గన్ పౌడర్ ఆనవాళ్లు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెప్పాయని అమెరికా మీడియా వెల్లడించింది. బాలికను ఫిలడెల్ఫియాలోని పిల్లల ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్థారించారు.