: భారీ మొత్తం వెచ్చించి రాన్ బాక్సీని కొంటున్న సన్ ఫార్మా
దేశీయ ఫార్మాలో అతిపెద్ద డీల్ జరగనుంది. దిగ్గజ ఫార్మా కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా, మరో దిగ్గజ ఫార్మా రాన్ బాక్సీని కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. 320కోట్ల డాలర్లు (రూ.19,200కోట్లు) వెచ్చించి రాన్ బాక్సీని కొనుగోలు చేస్తున్నట్లు సన్ ఫార్మా ప్రకటించింది. ఈ కొనుగోలు పూర్తయితే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జనరిక్ కంపెనీగా సన్ ఫార్మా అవతరిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు అమెరికా మార్కెట్లో పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
మాల్విందర్ సింగ్ సోదరుల నుంచి రాన్ బాక్సీలో గణనీయమైన వాటాను జపాన్ కు చెందిన దైచీ శాంక్యో 2008లో 420 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత దైచీకి కష్టాలు మొదలయ్యాయి. అమెరికాలో నాణ్యతలేని మందుల విక్రయంపై రాన్ బాక్సీపై కేసులు నమోదయ్యాయి. పెద్ద మొత్తంలో జరిమానా కూడా కట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాన్ బాక్సీని వదిలించుకుని కష్టాల నుంచి ఒడ్డెక్కాలని దైచీ భావించినట్లుగా కనిపిస్తోంది.