: తొలి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశ ఎన్నికలు నిర్వహించనున్న ఆరు స్థానాల్లో నేటితో ప్రచారం ముగిసింది. అసోంలో ఐదు, త్రిపురలో ఒకటి లోక్ సభ స్థానాల్లో ఏప్రిల్ 7 పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. అసోంలో దిబ్రూగఢ్, జోర్హట్, కలియబర్, లకీంపూర్, తేజ్ పూర్, త్రిపురలో పశ్చిమ త్రిపుర స్థానానికి ఏప్రిల్ 7న ఎన్నికలు జరగనున్నాయి.
కాగా, ఈ ఎన్నికల్లో అసోం ముఖ్యమంత్రి కుమారుడు గౌరవ్ గొగోయ్, కాంగ్రెస్ ఎంపీ బిజయ్ కృష్ణ హండిక్, బీజేపీ నేత సర్వనంద సొనావల్, కేంద్ర మంత్రులు రాణి నరా, పవన్ సింగ్ ఘటోవర్, పశ్చిమ త్రిపుర నుంచి సిట్టింగ్ ఎంపీ ఖగస్ దాస్ బరిలో ఉన్నారు. ఏప్రిల్ 7 న జరగనున్న ఎన్నికల్లో 240 కంపెనీల పారామిలటరీ బలగాలు పహారా కాస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఏప్రిల్ 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది.