: కేసీఆర్ మాట తప్పి, మభ్యపెడుతున్నారు: టీడీపీ నేత రమణ
తెలంగాణ ఉద్యమానికి ముందో మాట, తర్వాత ఓ మాట మాట్లాడటం కేసీఆర్ కే చెల్లిందని తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని, ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, హైదరాబాదు యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ ద మీడియా కార్యక్రమానికి ఆర్.కృష్ణయ్యతో కలిసి రమణ హాజరయ్యారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో టీడీపీ పాత్రను ఆయన వివరించారు. బీజేపీతో పొత్తుల వ్యవహారానికి సంబంధించి పలు అంశాలను ఆయన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేస్తోందని, తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేసి తీరుతుందని రమణ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలకు రాజ్యాధికారం కల్పించకుంటే పార్టీలోనే ఉండి పోరాటం చేయనున్నట్లు టీడీపీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు.