: ఆ ఎన్నికల్లో ఆమె మెజారిటీ... 31 ఓట్లే!
అసెంబ్లీ ఎన్నికల్లో 50 ఓట్ల లోపు మెజారిటీ రావడం మీకు తెలుసా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని నేత ఈలి ఆంజనేయులు సతీమణి ఈలి వరలక్ష్మి 50 కంటే కూడా తక్కువ ఓట్లతోనే ఒకసారి ఎన్నికల్లో నెగ్గారు. 1983 సంవత్సరంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈలి వరలక్ష్మి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పసల కనక సుందరరావు పోటీ పడ్డారు. వీరిద్దరి మధ్య పోటాపోటీగా ప్రచారం జరిగింది.
ఇక ఓట్ల లెక్కింపు సమయం రానే వచ్చింది. గూడెం టౌన్ హాల్లో కౌంటింగ్ జరిగింది. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, వంగవీటి మోహనరంగా వంటి ఉద్దండ నాయకులంతా తాడేపల్లిగూడెంలోనే మోహరించారు. చివరి రౌండ్ వరకు ఉత్కంఠభరితంగా లెక్కింపు జరిగింది. చంద్రబాబు కూడా తణుకులోని షుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ లో ఉండి... ఇక్కడి ఫలితం కోసం ఎదురుచూశారు. టీడీపీ గెలిచిందనే వార్త మొదట్లో బయటకు వచ్చింది. అంతలోనే రీకౌంటింగ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
చివరకు కాంగ్రెస్ అభ్యర్థిని వరలక్ష్మి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఆమెకు వచ్చిన ఆధిక్యం... కేవలం 31 ఓట్లు మాత్రమే. టీడీపీ అభ్యర్థి పసల కనక సుందరరావుకు 42,031 ఓట్లు రాగా, వరలక్ష్మికి 42,062 ఓట్లు వచ్చాయి. లెక్కింపు సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అప్పట్లో 144 సెక్షన్ విధించారు.