: భారతీయ మహిళకు బ్రిటీష్ రాచమర్యాద
విశిష్ఠ సామాజిక సేవలను అందిస్తున్న వారికి బ్రిటిష్ రాచకుటుంబం చేతుల మీదుగా ఇచ్చే ‘డేమ్ కమాండర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్’ (డీబీఐ) టైటిల్ ఆశా ఖేమ్కా అనే భారతీయ మహిళకు దక్కింది. ఈ గౌరవం అందుకున్న రెండో భారతీయ మహిళ ఆమె. ఒకప్పుడు ఇంగ్లీషు అక్షరం ముక్క రాని ఆశ ఇవాళ విద్యావేత్తగా ఈ స్థాయికి ఎదగడం విశేషం.
బీహార్ లోని సీతామఢీ నుంచి 1978లో లండన్ వెళ్లే నాటికి ఆశా ఖేమ్కాకు ఆంగ్ల పరిజ్ఞానం లేదు. కనీసం ఇంగ్లీషు రాయడం కూడా రాదు. అయితే ఇవాళ ఆవిడ ఓ విద్యావేత్త. ఎందరికో జీవితాన్ని ఇచ్చిన ఆమె వారి జీవన గతినే మార్చేశారు. లండన్ లోని వెస్ట్ నాటింగ్ హామ్ ఫైర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆశా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘డేమ్ హుడ్’ టైటిల్ ను ఇటీవలే అందుకున్నారు.
బ్రిటన్ రాణి లేదా రాజు స్వహస్తాలతో ప్రదానం చేసే ఈ పురస్కారాన్ని 1917లో నెలకొల్పారు. నాటి నుంచి నేటి వరకు ఈ టైటిల్ అందుకున్న రెండో భారతీయ మహిళ ఆశాఖేమ్కా. ఇంతకు ముందు 1931లో ధార్ మహారాణి లక్ష్మీదేవి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మగవాళ్లకు ఇచ్చేది ‘నైట్ హుడ్’ అయితే, ఆడవాళ్లకు ఇచ్చేది ‘డేమ్ హుడ్’. డేమ్ కమాండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ టైటిల్ ను ఆశాఖేమ్కా బకింగ్ హామ్ ప్యాలెస్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా అందుకున్నారు.