: జమ్మూలో పాకిస్థానీ శరణార్థుల ఓట్లు బీజేపీకే!
జమ్మూ కాశ్మీర్ లో తామంతా బీజేపీ అభ్యర్థికే ఓట్లేస్తామని పాకిస్థానీ శరణార్థులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. జమ్మూ లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్న జుగల్ కిశోర్ కు తామంతా ఓట్లు వేస్తామని సుమారు లక్ష మందికి పైగా ఉన్న పాకిస్థాన్ శరణార్థుల సంఘం నేత లభారాం గాంధీ ప్రకటించారు. జమ్మూ, సాంబా, కతువా జిల్లాల్లో పాక్ శరణార్థులు నివసిస్తుంటారు. 1947లో దేశ విభజన సమయంలోను, తర్వాత రెండుసార్లు 1965, 1971 సంవత్సరాల్లో యుద్ధాలు జరిగినప్పుడు వీళ్లంతా భారత్ కు వలస వచ్చారు. శరణార్థుల్లో సుమారు 40 వేల మందికి పైగా ఓటర్లున్నారు. దాంతో వీళ్ల ఓట్లు జయాపజయాల్లో కీలకంగా మారాయి. జమ్మూ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా జుగల్ కిశోర్, కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మదన్ లాల్ శర్మ, పీడీపీ అభ్యర్థిగా యశ్ పాల్ శర్మ బరిలో ఉన్నారు. ఈ నెల 10వ తేదీన అక్కడ ఎన్నిక జరగనుంది.
ఇటీవల కతువా జిల్లాలోని హీరానగర్ పట్టణంలో ఓ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, బీజేపీ అధికారంలోకి వస్తే శరణార్థులందరికీ పూర్తిస్థాయి పౌరసత్వ హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇన్నాళ్ల నుంచి ఈ శరణార్థులు లోక్ సభ ఎన్నికల్లో అయితే ఓట్లు వేయగలుగుతున్నారు గానీ, వారికి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు లేదు. వాళ్లు ప్రభుత్వోద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు. అలాగే, అక్కడ ఆస్తులు కూడా కొనుగోలు చేయకూడదు. ఈ అన్ని అంశాల్లో తమకు హక్కులు కల్పించాలని చాలాకాలంగా శరణార్థులు పోరాడుతున్నారు.