: బ్యాంక్ లోన్ తీర్చేందుకు ఏకంగా దొంగనోట్లనే తీసుకొచ్చాడు!
బ్యాంక్ లోన్ తీర్చేందుకు బ్యాంకుకు దొంగనోట్లను ఓ వ్యక్తి తీసుకువచ్చాడు. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ లో కలకలం రేపింది. ఒకటీ, రెండూ కాదు... ఏకంగా లక్షా అరవై వేల రూపాయల దొంగనోట్లను వినియోగదారుడు తీసుకురావడంతో బ్యాంకు అధికారులు నోరెళ్లబెట్టారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు తీర్చడానికి వచ్చిన వ్యక్తి... మొత్తం రూ. 2 లక్షలు తీసుకురాగా, అందులో 1.60 లక్షలు దొంగనోట్లు అని బ్యాంకు సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆ నోట్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.
అయితే, సదరు వ్యక్తి తనకు తెలిసే ఈ దొంగ నోట్లు తీసుకువచ్చాడా... లేక ఎవరైనా అతడికి తెలియకుండా అంటగట్టారా? అనే విషయం విచారణలో తేలాల్సి ఉంది. ఎన్నికల సందర్భంగా కొన్ని పార్టీలు దొంగ నోట్లను చెలామణి చేస్తుండటంతో ఎవరైనా ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. లేకపోతే అంత ధైర్యంగా దొంగనోట్లను తీసుకుని బ్యాంకుకు వచ్చే అవకాశం ఉండదని కూడా అంటున్నారు.