: రాహుల్, మోడీలకు అసూయ కలిగేలా పాలిస్తున్న సీఎం


గుజరాత్ ను అభివృద్ధి పథంలో నడిపాను, అత్యుత్తమ పాలన అందించానని చెప్పే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి, దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత మాదే అని చెప్పుకునే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అసూయ కలిగేలా సిక్కిం రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పరిపాలిస్తున్నారు.

ఆయన గురించి చెప్పాలంటే... దేశంలో అత్యంత తక్కువ జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రాష్ట్రం, ప్రతి మారుమూల గ్రామం నుంచి రాష్ట్ర రాజధానికి ఆటోలో వెళ్లగలిగే రాష్ట్రం, రెండేళ్లు ఆగితే దేశంలో రుణవిముక్తమైన ఏకైక రాష్ట్రం, 1994 నుంచి అసలు ప్రతిపక్షమే లేని రాష్ట్రం, దేశంలో ప్లాస్టిక్ వినియోగమే లేని ఏకైక రాష్ట్రం. ఇన్ని ఘనతలు చాలవూ? ఆయన ప్రత్యేకతను చాటడానికి!

సిక్కిం నుంచి ఒకే వ్యక్తిని లోక్ సభకు పంపుతారు. అందుకే లోక్ సభ ఎన్నికలపై అక్కడ ఆసక్తి ఉండదు. అసెంబ్లీ ఎన్నికలపైనే అందరి దృష్టి. పవన్ కుమార్ చామ్లింగ్ గ్రామపంచాయతీ అధ్యక్ష పదవి నుంచి ఎదిగారు. సిక్కిం సంగ్రామపరిషత్ లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి నర బహదూర్ భండారి నియంతృత్వ పోకడలను ఎదిరించి సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్ స్థాపించారు. భండారికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు.

ఒకసారి అసెంబ్లీకి కొవ్వొత్తితో వచ్చారు. సహచరులంతా వెలుగుతున్న కొవ్వొత్తి ఎందుకు? అని ప్రశ్నిస్తే... 'ప్రజాస్వామ్యం ఎక్కడైనా కనబడుతుందేమో వెతకడానికి' అని తడుముకోకుండా సమాధానమిచ్చి సహచరులకు కర్తవ్యాన్ని బోధించాడు. ఈ సారి ఆయనే గెలుస్తాడా? లేక కొత్త రాజకీయ శకం మొదలవుతుందా? అని సిక్కిం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. వారికి మోడీ, రాహుల్ గురించి పట్టింపులేదు. అందుకు కారణం వారి ముఖ్యమంత్రి అంత చక్కగా పరిపాలిస్తున్నాడు మరి.

  • Loading...

More Telugu News