: అంతర్జాతీయ కుంభకోణంలో కేవీపీ... అమెరికా కోర్టులో అభియోగాలు నమోదు
దివంగత ముఖ్యమంత్రి 'వైెఎస్ ఆత్మ' అయిన కేవీపీ రామచంద్రరావు అంతర్జాతీయ కుంభకోణంలో కీలక నిందితుడిగా బుక్కయ్యారు. రూ. 110 కోట్ల ముడుపుల కేసులో ఆయనపై అమెరికాలోని షికాగో ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. రాష్ట్రంలోని టైటానియం గనులను విదేశీ కంపెనీలకు అప్పగించే వ్యవహారంలో కేవీపీ కీలక సూత్రధారి అని కోర్టు తెలిపింది. ఈ వ్యవహారంలో ఆయన దేశ, విదేశీ చట్టాలను ఉల్లంఘించి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని కోర్టు స్పష్టం చేసింది. విదేశీ వ్యాపారులతో కలసి కుట్ర, కుంభకోణానికి పాల్పడ్డారని కోర్టు అభియోగాలు నమోదు చేసింది. రాష్ట్రంలోని టైటానియంను వెలికితీసి, అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుని కోట్లాది రూపాయలను మూటగట్టుకునే ప్రయత్నం చేశారని కోర్టు తెలిపింది.
కోర్టు వివరాల ప్రకారం... వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం (2006 ఏప్రిల్)లో ఈ కుంభకోణానికి తెరలేచింది. టైటానియంను తవ్వుకుని తీసుకెళ్లడానికి... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అనేక అనుమతులు అవసరమని కేవీపీ విదేశీ వ్యాపారులకు చెప్పారు. దీనికోసం రూ. 110 కోట్ల ముడుపులు ఇచ్చేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. రూ. 64 కోట్ల సొమ్ము ఇప్పటికే చేతులు మారిందని కోర్టు తెలిపింది. ఈ వ్యవహారంలో, కేవీపీతో పాటు హంగరీకి చెందిన వ్యాపారి ఆండ్రస్ నాప్, ఉక్రెయిన్ కు చెందిన సురెన్ జొవెర్గ్యాన్, ఎన్నారై గజేంద్రలాల్, శ్రీలంకకు చెందిన సుందరలింగాలపై షికాగో కోర్టు అభియోగాలు మోపింది. వీరికి చెందిన రూ. 64 కోట్ల ఆస్తులను జప్తు చేయాలని అభియోగ పత్రాల్లో పేర్కొంది.
ఈ లావాదేవీల్లో ఉక్రెయిన్ జాతీయుడైన దిమిత్రీ ఫిర్తాష్ అనే వ్యక్తి కూడా కీలక పాత్ర పోషించాడు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిమిత్రీ ఆయనను కలిశాడని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో దిమిత్రీని గత నెల 12వ తేదీన అరెస్ట్ చేశారు. అనంతరం, దాదాపు రూ. 100 కోట్ల (1.74 కోట్ల డాలర్లు) పూచీకత్తుపై విడుదల చేశారు. ఒక అంతర్జాతీయ కుంభకోణానికి తమ (అమెరికా) భూభాగాన్ని ఉపయోగించుకోవడంపై ఫెడరల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని అంతర్జాతీయ కుంభకోణంగా, ద్రవ్య అక్రమ చలామణీగా కోర్టు భావించింది. దీనిపై అమెరికా న్యాయ విభాగం (క్రిమినల్ డివిజన్) అసిస్టెంట్ అటార్నీ జనరల్ మాట్లాడుతూ... అంతర్జాతీయ అవినీతిపై తమ న్యాయ విభాగం పోరాడుతుందని, ఈ ఆరుగురిపై అభియోగాలు నమోదు చేయడం ద్వారా... ఎవరైనా, ఎక్కడైనా విదేశీ అధికారులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినా ఊరుకోమనే సంకేతాలు పంపామని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కేవీపీ రామచంద్రరావు టైటానియం గనుల్లో తన గొయ్యి తానే తవ్వుకున్నట్టయింది. ఏకంగా షికాగో ఫెడరల్ కోర్టే రంగంలోకి దిగడంతో... ఆయన భవిష్యత్తు ఏమిటనేది ఊహించవచ్చు. ఈ కుంభకోణంలో మరిన్ని పెద్ద తలకాయలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది.