: పేరుకే చిన్న పార్టీలు.. కానీ, పనితీరు అద్భుతం!
చూడటానికి అవి చిన్న పార్టీలే. కానీ దేశ రాజకీయాల్లో వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దది. సంకీర్ణ రాజకీయాల యుగం మొదలయ్యాక ఈ చిరు పార్టీలు పెను ప్రభావం చూపుతున్నాయి. 1989 నుంచి ప్రతి ఎన్నికలోనూ ఈ చిన్న పార్టీలు కనీసం 22 ఎంపీ సీట్లు గెలుచుకుని తమ సత్తా చాటాయి. 2009 ఎన్నికల్లోనైతే ఈ పార్టీలన్నీ కలిపి 5.34 కోట్ల ఓట్లను పొందాయి.
రాష్ట్రీయ ఆమ్ పార్టీ, జనతా రాజ్ పార్టీ, హమ్ సబ్ కీ పార్టీ, గరీబ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీల పేర్లు కూడా మనకు తెలియదు. కానీ వీటిలో కొన్ని పార్టీలు సంచలనాలు రేపుతున్నాయి. దేశంలో చిన్న చిన్న రాజకీయ పార్టీల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటిలో చాలా పార్టీలకు గుర్తింపు కూడా లేదు. 1989లో చిరు పార్టీల సంఖ్య 77. గత ఎన్నికల్లో ఈ పార్టీల సంఖ్య 321కి చేరుకుంది. ఈసారి ఎన్నికల్లో 1600కి పైగా గుర్తింపు లేని పార్టీలు బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు అంచనా. వీటి ఓట్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 1999లో ఇవన్నీ కలిపి 16 సీట్లు, 2 కోట్ల ఓట్లను గెలుచుకున్నాయి. 2004లో 20 సీట్లు, 3.5 కోట్ల ఓట్లు గెలుచుకున్నాయి. ఇక, 2009 ఎన్నికల్లో 21 సీట్లు, 5.34 కోట్ల ఓట్లు సంపాదించుకున్నాయి. చిన్న పార్టీల బలాన్ని గుర్తించిన నరేంద్ర మోడీ గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి చిన్న పార్టీలతో అవగాహనకు వచ్చారు. దీన్ని బట్టి చిన్న పార్టీల పనితీరు ఏపాటిదో అర్థమవుతోంది కదా!