: కృష్ణపట్నంలో ప్రభుత్వ తొలి ‘మెగా’ థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అభివృద్ధి సంస్థ నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా, జాతీయ స్థాయిలోనే ప్రభుత్వ రంగంలో నిర్మించిన మొట్టమొదటి 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్కేంద్రంగా కృష్ణపట్నం చరిత్రకెక్కింది.
ప్రైవేటు రంగంలో టాటా సంస్థ ముంద్రా వద్ద తొలి 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్కేంద్రాన్ని నిర్మించగా... ప్రభుత్వ రంగంలో ఏపీపీడీసీఎల్ తొలి యూనిట్ ను నిర్మించింది. ఏపీ జెన్ కో, నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు), రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏపీపీడీసీఎల్ ఏర్పడింది. జెన్ కో పర్యవేక్షణలో ఈ విద్యుత్కేంద్ర నిర్మాణం జరిగింది. సోమవారం రాత్రి 10.29 గంటలకు కృష్ణపట్నం థర్మల్ కేంద్రం నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ ను జాతీయ గ్రిడ్ కు అనుసంధానించినట్టు ఏపీపీడీసీఎల్ ప్రకటించింది. నాలుగు గంటల పాటు నడిచిన ఈ కేంద్రం ద్వారా 55 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని ఏపీపీడీసీఎల్ ఛైర్మన్ విజయానంద్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.