: ఎన్టీవీకి సీఎం రమేష్ సవాల్
తెలుగు టీవీ చానెల్ ఎన్టీవీలో వచ్చిన ఎన్నికల సర్వే రిపోర్టు బూటకమని టీడీపీ నేత సీఎం రమేష్ కొట్టి పారేశారు. ఎన్టీవీకి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాలు విసిరారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఎన్నికల్లో 60కి పైగా స్థానాల్లో టీడీపీ పోటీ లేకుండా గెలుస్తుందని అన్నారు. మిగిలిన ముప్పై సీట్లలో వైఎస్సార్సీపీ పోటీ ఇస్తుందని ఆయన తెలిపారు. తమ పార్టీ కూడా సర్వేలు చేస్తోందని ఆయన తెలిపారు. కానీ, వాటిని తాము బయట పెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ గ్రాఫ్ పడిపోతుందన్న భయంతో సర్వే పేరిట నాటకాలు ఆడుతోందని ఆయన అన్నారు. సాక్షి కథనాలను ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే ఎన్టీవీని సాక్షి అద్దెకు తీసుకుందని ఆయన మండిపడ్డారు. సర్వేలపై విచారణకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని సీఎం రమేష్ తెలిపారు.
సర్వేల్లో ఒక శాంపిల్ తీసుకోవాలంటే 100 రూపాయలు ఖర్చవుతుందని, మూడు లక్షల శాంపిళ్లు తీసుకున్నామని ఆయన అంటున్నారు. అంటే ఎంత ఖర్చై ఉంటుందని ఆయన ప్రశ్నించారు. గతంలో వైఎస్ చనిపోయారనే సానుభూతితో ఓట్లు పడ్డాయని, ఇప్పుడు అలాంటి సానుభూతి లేదని తేలడంతో సర్వే నాటకాలకు తెరతీశారని ఆయన ఆరోపించారు.