: 'పసుపు' తుపాను వస్తోంది.. కాచుకోండి: కాంగ్రెస్ కు బాబు సవాల్
నీలం తుపాను నష్టపరిహారం ఇంకా చెల్లించని కాంగ్రెస్ సర్కారును మరికొద్ది రోజుల్లో 'పసుపు' తుపాను తుడిచిపెట్టడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నీలం తుపానులో నష్టపోయిన తమకు ఇంకా పరిహారం అందలేదని టీడీపీ కార్యకర్త ఒకరు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో, బాబు తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం బాబు తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పసుపు' తుపానులో కాంగ్రెస్ కొట్టుకుపోవడం తథ్యమని, అప్పటివరకు వేచిచూడాలని కార్యకర్తలకు సూచించారు. నియోజకవర్గాల్లో నాయకత్వలోపం లేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ రోజు ఉదయం బాబు జగ్గంపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సంసిద్ధులై ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం ఆయన పాదయాత్ర కొనసాగించారు. తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిందని బాబు అన్నారు. వైఎస్ నుంచి నేడు కిరణ్ వరకు పాలకుడు ఎవరైనా ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురిచేశారని ఆయన ఆరోపించారు. తెలుగుజాతికి పూర్వ వైభవం రావాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని బాబు నొక్కి చెప్పారు.