: పదో తరగతి విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడి కీచకపర్వం
ఒకవైపు పరీక్షలు... మరోవైపు రక్తస్రావంతో ఓ బాలిక నరకయాతన అనుభవించింది. అలస్యంగా వెలుగుచూసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కీచకపర్వానికి పరాకాష్ఠ ఈ ఘటన. గుంటూరు జిల్లా బాపట్ల రైలుపేట ఐదో లైనులో జవహర్ భారతి కాన్వెంట్ స్కూలును అన్నవరపు శ్రీనివాసరావు(50) నడుపుతున్నాడు. అదే ప్రాంతంలో అతనికి మరో రెండు పాఠశాలలు ఉన్నాయి.
కామాంధుడైన శ్రీనివాసరావు కళ్లు మనవరాలి వయసున్న, పదో తరగతి విద్యార్థినిపై పడ్డాయి. దీంతో పరీక్షల్లో మెళుకువలు చెబుతానంటూ మార్చి 26న ఆ బాలికను ఇంటికి రమ్మన్నాడు. నిజమని నమ్మి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుందామని అతనింటికి వెళ్లిన బాలికపై కామంతో కళ్లు మూసుకుపోయిన శ్రీనివాసరావు అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన బాలిక గత ఐదు రోజులుగా తీవ్ర రక్తస్రావమవుతున్నా ఎవరికీ చెప్పుకోలేకపోయింది.
ఇళ్లలో పాచిపనిచేస్తూ బాలికను చదివిస్తున్న తల్లి, విషయం గ్రహించి నిలదీయడంతో బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. దీనిపై ఆమె స్థానిక పెద్దలకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు పాఠశాలను ధ్వంసం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న శ్రీనివాసరావు కోసం గాలిస్తున్నారు.