: ప్రాణం తీసిన ఫేస్ బుక్ కామెంట్లు


ఫేస్ బుక్ లోని కామెంట్లు ఓ బాలుడి ప్రాణం తీశాయి. ఎల్ బీ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాదులోని ఎల్ బీ నగర్ హస్తినాపురం సాయినగర్ కు చెందిన గొట్టి దుర్గయ్య, రమ దంపతుల కుమారుడు ప్రవీణ్(14) హస్తినాపురంలోని నాగార్జున హైస్కూలులో 9వ తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్ లో అనిల్, యశ్వంత్, ఓ బాలిక కూడా చదువుతున్నారు.

ఎస్కేడీ నగర్ కు చెందిన అజార్ దిల్ షుక్ నగర్ పబ్లిక్ స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్నాడు. ఆ బాలికతో పరిచయం పెంచుకునేందుకు అజార్ రోజూ హస్తినాపురం చౌరస్తాకు వచ్చేవాడు. ఈ క్రమంలో ప్రవీణ్, అనిల్, యశ్వంత్ తో అజార్ కు పరిచయం ఏర్పడింది. అది ఫేస్ బుక్ లో అభిప్రాయాలు పంచుకునేవరకు వెళ్లింది. ఈ దశలో ఆ బాలిక ప్రవీణ్ తో చనువుగా ఉండడం సహించలేని అజార్ అతనిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి.

ఈ క్రమంలో శనివారం ఓ ఇంటర్నెట్ సెంటర్ నుంచి ప్రవీణ్, యశ్వంత్, అనిల్ లు ఫేస్ బుక్ లో అజార్ ను దర్భాషలాడారు. దీంతో సాహెబ్ నగర్ కు చెందిన కొంతమందితో కలిసి ఆటోోలో నాగార్జున హైస్కూలుకు అజార్ చేరుకున్నాడు. స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న ప్రవీణ్, అనిల్, యశ్వంత్ ను హస్తినాపురం చౌరస్తాలో ఆటో ఎక్కించుకుని లక్ష్మీనరసింహకాలనీ కమాన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ యశ్వంత్ పారిపోగా, ప్రవీణ్ ను కిందపడేసి, చేతిలో ఉన్న కడియంతో తలపై బలంగా కొట్టి వదిలేశారు. అనిల్ ను బీఎన్ రెడ్డి నగర్ కు తీసుకెళ్లి దాడి చేసి వదిలేశారు.

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రవీణ్ తండ్రి దుర్గయ్య, సోదరుడు మహేష్ కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన అజార్ అతడి స్నేహితులపై కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేసిన పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News