: ధోనీ తప్పుడు సమాచారమందించాడు: ప్రాసిక్యూషన్ వాదన
ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా ముద్గల్ కమిటీ తరపున సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోనీ ముద్గల్ కమిటీ ఎదుట తప్పుడు సమాచారం అందించాడని సాల్వే ధర్మాసనానికి తెలిపారు. ధోనీ చెన్నై జట్టుకు సారథే కాకుండా, శ్రీనివాసన్ కు చెందిన ఇండియా సిమెంట్స్ లో ఉపాధ్యక్షుడిగా ఉన్నాడని, ఆ ప్రయోజనాల దృష్ట్యానే అతడు వాస్తవాలను దాచి ఉంటాడని సాల్వే వాదించారు.
కాగా, ఐపీఎల్-6లో ఫిక్సింగ్ వ్యవహారం వెలికిచూడగానే శ్రీనీ అల్లుడు, చెన్నై ఫ్రాంచైజీ సీఈవో గురునాథ్ మెయ్యప్పన్ పై ఆరోపణలు వచ్చాయి. అయితే, గురునాథ్ కు చెన్నై ఫ్రాంచైజీతో ఎలాంటి సంబంధం లేదని, క్రికెట్ అంటే ఉన్న ఆసక్తితోనే జట్టు వెంట ఉండేవాడని శ్రీనివాసన్ సమర్థించుకోజూశారు. సరిగ్గా ధోనీ కూడా ఇదే సమాచారాన్ని ముద్గల్ కమిటీతో తెలిపినట్టు తెలుస్తోంది.