: అలా జరిగితే 'బ్లాక్ బాక్స్' ఆచూకీ కష్టమే!
మలేసియా విమానం ప్రమాదానికి గురైనట్టు ఓ అంచనా ఏర్పడిన తర్వాత అందరి దృష్టి బ్లాక్ బాక్స్ పైకి మళ్ళింది. విమానంలో జరిగే ప్రతి సాంకేతిక చర్య ఈ బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తం అవుతుంది. దీంతో, విమానానికి అసలేం జరిగిందన్నది తెలుసుకోవాలంటే ఈ బాక్స్ కీలకం. అయితే, ఆ బాక్స్ లో ఉన్న బ్యాటరీలు మరో రెండు వారాలు మాత్రమే పనిచేస్తాయని, ఆలోపే దాని ఆచూకీ కనుగొనాల్సి ఉంటుందని వైమానిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విమానంలో బ్లాక్ బాక్స్ తో పాటు కాక్ పిట్ వాయిస్ రికార్డర్ కూడా ఉంటుంది. ఈ రికార్డర్ కాక్ పిట్ లో జరిగే చివరి అర్ధగంట సంభాషణలను రికార్డు చేస్తుంది. తద్వారా, విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాలు పైలట్ల మాటల్లో వెల్లడయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రెండు ఉపకరణాల్లో ఉండే ట్రాన్స్ మీటర్లు సంకేతాలు వెలువరిస్తూ ఉంటాయి. తద్వారా అవి ఎక్కడున్నాయో తెలుసుకోవడం సులువవుతుంది. మలేసియా విమానంలోని బ్లాక్ బాక్స్ బ్యాటరీల సామర్థ్యం సన్నగిల్లుతోందన్న నిపుణుల హెచ్చరిక నేపథ్యంలో ఏప్రిల్ రెండోవారంలోగా దాన్ని కనుగొనకపోతే ప్రమాద ఘటన మిస్టరీగానే మిగిలిపోనుంది.